నక్కను కొట్టి చంపిన జనం.. ఎక్కడో తెలుసా

నక్కను కొట్టి చంపిన జనం.. ఎక్కడో తెలుసా

ఏపీలోని అనంతపురం జిల్లాలో నక్కదాడిలో 8 మంది గాయపడ్డారు. రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామ సమీపంలోని చెరువు వైపు చీకట్లో బహిర్భూమికి వెళ్లిన గ్రామ ప్రజలపై నక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.  అటవి ప్రాంతం నుంచి వచ్చిన నక్క గ్రామస్థులపై దాడి చేసింది. ఇందులో 8 మందికి గాయాలయ్యాయి. అనంతరం నక్కను గ్రామస్థులు వెంటపడి కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు,అటవీ అధికారులు గ్రామానికి వచ్చి విచారణ జరిపారు. నక్క దాడిలో గాయపడ్డ వారిని  రాయదుర్గం ఆస్పత్రికి తరలించారు.

సమీపంలో అటవీ ప్రాంతం ఉండటంతో నక్క ఆహారం కోసం జనావాసాల వైపు వచ్చినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. గత రెండు రోజులుగా బొమ్మక్కపల్లిలో గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బంధువులు, మిత్రులు తరలిరావడంతో మాంసాహార భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. వాసనకు పసిగట్టిన నక్క గ్రామంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల అటవీ జంతువులకు కావలసిన ఆహారం, నీరు అందకపోవడంతో గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. రెండు రోజుల క్రితం  ( వార్త రాసే రోజుకు) రాయదుర్గం పట్టణంలోకి ఎలుగుబంట్లు చొరబడి ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాయి. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంట్లను అడవిలోకి తరిమేశారు. బొమ్మక్కపల్లి గ్రామంలోకి వచ్చి ప్రజలపై దాడి చేసిన నక్కను స్థానికులు కొట్టి చంపి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.